వేదిక: వైకుంఠం

మరునాడు ఉదయానికి త్రిమూర్తులు మరియూ యమధర్మరాజు,ఇంద్రుడు వైకుంఠంలోని ఆంతరంగిక సమావేశమందిరానికి చేరుకున్నారు. మహాశివుడు,బ్రహ్మదేవుడు వారివారి దంపతుల మధ్య జరిగిన సంభాషణని ప్రస్తావించారు-దాపరికం లేకుండా.

ఉభయులూ కూడా ఏకకంఠంతో మహావిష్ణువుతో "మహాప్రభో,మాయొక్క,మా భార్యలయొక్క అభిప్రాయలు తెలియచేశాం,ఆ పైన మీరు ఏ విధంగా చేస్తే ధర్మవిరుద్ధం కాదో,అదేదో మీరే శెలవివ్వండి" అన్నారు.

అప్పుడు శ్రీ మహా విష్ణువు మహాదేవుడు, బ్రహ్మలతో పాటుగా అక్కడ ఉన్న యమధర్మరాజుని,దేవేంద్రుణ్ణి కూడా ఉద్దేశిస్తూ ఇలా చెప్ప సాగాడు సుదీర్ఘంగా!

ఈ మానవులకు వచ్చిన కోర్కె సమంజసమైనదే-మనం ఒక్కసారి కృతయుగం నుంచి సృష్టిని పరిశీలిస్తే,ప్రతీ యుగంలోనూ కొద్దిమార్పు కనపడుతూనేవుంది ఈ మానవుల్లో.

ప్రతీ స్త్రీ సౌభాగ్యవతిగా, మాంగళ్యవతిగానే పోవాలనే కోరుకునేవారు పూర్వపు రోజుల్లో-కలియుగ ఆరంభంలోకూడా,దానికి కారణాలు మనం పరికిద్దాం-మనందరికీ తెలిసినవే అయినా కూడా- సందర్భం కాబట్టి.

ఇంటి పెద్ద అయిన భర్తని కోల్పోయిన భార్య శేషజీవితం దుర్భరమే,తన మిగిలిన జీవితాన్ని,ఎవరి మీదనో ఆధార పడుతూ,లేదా ఎవరి పంచనో చేరి గడపాల్సి వచ్చేది;ఆ స్థితి తనకు రాకూడదని ఈ విధంగా కోరుకునేది.

అదీ కాకుండా బాల్యవివాహాలు జరిగి వివాహం అయిన బాలికలు భర్తల్ని కోల్పోయి వాళ్ళ జీవితాంతం తమ పుట్టినింటిలోనూ,ఆ అమ్మాయి తల్లితండ్రులు కాలం చేసిన తర్వాత తన తోబుట్టువుల దగ్గరో,తోబుట్టువులు లేకపోతే,బంధువుల దగ్గరో జీవితాంతం కాలం గడపాల్సివచ్చేది.దీనికి తోడు చిన్నతనంలోనే విధవరాలు అయిన తర్వాత ఆ అమ్మాయి జీవితాంతం శుభకార్యాలకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉండేది కాదు-మనసులో కోరిక ఉన్నా.

సొంతవాళ్ళు ఒప్పుకున్నా చుట్టూఉన్న సమాజం ఊరుకునేది కాదు,అభ్యంతర పెట్టేవాళ్ళు,ఆక్షేపించేవాళ్ళు.ఈ పరిస్థితిని చూడటంవల్ల కూడా తర్వాతి తరం ఆడవాళ్లు సుమంగళిగానే పోవాలని కోరుకునేవారు; అలా అని వాళ్లకి జీవితం మీద తీపి-ఆశా లేదని కాదుగా!

వారి కోరిక ఎలా ఉన్నా వారి కర్మానుసారం మనం వాళ్ళఆయుష్షు నిర్ణయించేవాళ్ళం తప్ప-వాళ్ళు కోరుకున్నారని అర్ధాంతరంగా వాళ్ళ ప్రాణాలు యమపాశం తీసుకొని రాలేదు అప్పుడూ, ఎప్పుడూనూ.

అలాగే రాజులు పరిపాలించిన కాలంలో కూడా,యుద్ధంలో పరాయిరాజు చేతిలో తన భర్త మరణిస్తే -మహారాణులు,వారి స్త్రీ సంతానం సతీసహగమనం చేసేవారు; అంతఃపురకాంతలే కాకుండా ముఖ్య అనుంగు పరిచారికలు కూడా.దానికి కారణం తమ రాజ్యాన్ని గెలిచిన శత్రుదేశపురాజు అంతఃపురకాంతల్ని చెరబట్టేవాళ్ళు-ఆ స్త్రీలు అనుకూలురు అయ్యే వరకు.ఈ పరిస్థితినుంచి తప్పించుకోవడానికే ఆ స్త్రీలు ఇలా చేసేవాళ్ళు;అది చూసిన ప్రజలకు అది ఒక ఆచారంగా తయారుచేసారు ఆ నాటి సమాజంలో.

కొందరు స్త్రీలు ఇష్టపూర్వకంగా పతి చితిపై పోయేవారు,కొందర్ని బలవంతంగా సమాజంలోని పెద్దలు,చాదస్తులు చితిపై తోసేవారు- అనాగరికంగా.ఈ పరిస్థితులవల్ల స్త్రీలు తప్పనిసరి అయి ఈ దురాచారాన్ని ఆచరించేవాళ్ళు- అంతేకాని వాళ్లకి జీవితేచ్చ నశించికాదు-ఆ భావోద్వేగం, ఆచారాల ఒరవడిలో క్షణికావేశంలో చేసేవాళ్ళు.

అలాగే మగవాళ్ళు కూడా జీవితాంతం సహధర్మచారిణి అయిన భార్యమీదే ప్రతి విషయంలో ఆధారపడేవారు-కాడెద్దుల జోడీ లాగా.పొలం పనుల్లో పనిచేసే కాడెద్దుల్లో ఈ ఒకటి పోయినా రెండో ఎద్దు చాలా డీలా అయిపోతుంది తన భాగస్వామి లేకపోవడంతో,ఇది మనం ఇతర పశుపక్ష్యాదులలో కూడా గమనించవచ్చు. అందుచేత భార్య పోయిన భర్త తాను కూడా పొతే బాగుణ్ణు,లేదంటే మిగిలిన జీవితంలో తన ఆలనాపాలనా ఎవరు చూస్తారు అనే భావన దృఢంగా ఉండేది మగవాళ్లలో కూడా.

యుగయూగానికి తప్పని సరిగా మార్పు జరగటం సహజం ఈ సృష్టిలో.తన ప్రాణం మీద తీపిలేని మానవులు ఉండరు కదా,మనుషులేమిటి పశుపక్ష్యాదులు కూడా తమకు ప్రాణహాని సంభవిస్తోంది అని ఊహామాత్రంగా అనిపించినా అవి వాటి ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాయి-ఇది సృష్టిలోని ప్రతి ప్రాణికి సహజం!

నాగరికత పెరిగిన కొద్దీ బాల్యవివాహాలు,సతీ సహగమనాలు అంతరించిపోయాయి. దీని ప్రకారం పరికిస్తే మానవులు కోరుకునే “ఈ కొత్తకోర్కె”అందరి కోరికగా భావించి మానవజాతి కోరికగా అందరికి అంటగట్టలేము! కలియుగం గడుస్తున్న కొద్దీ మానవుల ప్రవర్తన,వాళ్ళ జీవితాల్లో,ఆలోచనలో ఊహించని మార్పు వచ్చింది.ఎవరూ కూడా - మరొకరిపై ఆధారపడి బతుకుతున్న రోజులు కావు ఇవి,ఎవరికి వారే స్వతంత్రంగా బతుకుతున్నారు కలిసినివసిస్తున్నా- ఆర్ధిక స్వాతంత్రం వచ్చిన తర్వాత.దాదాపుగా ఏ స్త్రీ ఈ రోజు సమాజంలో ఆర్ధికంగా వేరొకరిపై ఆధారపడే పరిస్థితీ అవసరమూ లేదు.

దానికి అనుగుణంగానే వాళ్ళ ఆలోచనల్లో బతుకుల్లో పెనుమార్పులు వచ్చాయి, యమభటులు ఈ కోరికని విన్నది కొందరి దగ్గర మాత్రమే,దీన్ని పరిగణలోకి తీసుకొని మన సృష్టిధర్మాన్ని మార్చవలసిన పనేలేదు. ఇక్కడ ఇంకోముఖ్య మైన విషయం మీముందు ప్రస్తావనకు తేవాలి సందర్భోచితం కనుక. మనమందరం ఇలా చర్చించడానికి కూర్చున్న విషయం ఏమిటి.మానవుల కోరిక- అదీ భావోద్వేగానికి లోనయినప్పుడు మనసు లోబడే పరిస్థితి.

త్రిమూర్తులమైన మనమే ఒక్కొక్కసారి దీని ప్రభావానికి లోనయిన సంఘటనలూ మనందరకూ తెలిసిన విషయమే-మరీ ముఖ్యంగా సదాశివుడితో- దానితో మనం ఎన్ని తిప్పలు పడ్డామో మనకింకా జ్ఞప్తిలోనే ఉంది కూడా.అలా అని నేనూ దాని ప్రభావానికి లోనుకాని వాణ్ణేమీ కాదే.యుగాల పూర్వపు మాటలే కాదు, ఈ మధ్య-రెండు మూడు రోజులు క్రిందట జరిగిన సంఘటన-మీకు కూడా తెలుసు కదా.

నేనూ-లక్ష్మి భావోద్వేగానికి లోనయ్యే కదా ఏ మాత్రం ఆలోచన లేకుండా ఈవెంటనే “బాలుని” పిలిపించేసాను గంధర్వలోకానికి-అతనికి పూర్ణాయుర్దాయం ఉన్నాకూడా!

దాని ప్రభావం మనమంతా చూస్తూనే ఉన్నాం- భూలోకంలో అతనికోసం వాళ్ళు పడే వేదన, బాధ-ఆ రోజు మేము ఈ భావోద్వేగానికి లోనుకాకుండా ఉంటే ఇంకొన్నేళ్లు మన బాలు అక్కడ ఉండి అందర్నీ ఆనందపరిచేవాడు కదా.

ఇది పొరపాటుకాదు గాని భావోద్వేగాలకు లోనవుతే కలిగే పర్యవసానం.ఈ విషయం మొన్నామధ్య నా భక్తుడొకడు ప్రస్తావనికి తెచ్చాడు కూడా మామాటల మధ్యలో! బాలు అందరి బంధువు కాబట్టి ఇంత బాధా-వేదనానూ-భూలోకవాసులు కూడా క్రమేపీ వాస్తవాన్ని గ్రహించి వాళ్ళవాళ్ళ దైనిక జీవితంలో మునిగిపోతారు-కాల ప్రభావంలో బాలు వాళ్ళ జ్ఞాపకాల్లో,గుండెల్లో నిక్షిప్తమైపోతాడు.

అందుకే ప్రతీవాళ్ళు భావోద్వేగాల్ని-ప్రత్యేకంగా మానవులు అదుపులో పెట్టుకోవాలి ఎలాంటి సంఘటనలు వాళ్ళజీవితంలో జరిగినా- ప్రభావానికి గురికావడం మానవ సహజం.ఇప్పుడు మనం చర్చించుకునే విషయం ఆ కోవకు చెందినదే- ఈ భావోద్వేగాలు క్షణికం. మరొక విషయం-మన జీవిత బాగస్వాములు కూడా మన ఆలోచనలకు దాదాపు దగ్గరగా ఆలోచించారు కదా.మన “దాంపత్య జీవితాల అన్యోన్యత, ఆలోచనా విధానం మానవులందరూ ఆచరించకలిగితే మనమిచ్చిన ఈ మానవజన్మ సార్ధకమే కదా వాళ్లకి-ఆనందంతో బాటు”!

అసలు విషయానికి వచ్చి ముగింపు పలుకుదాం-ఎప్పటిలాగే “సృష్టి , స్థితి, లయలు జరుగుతాయి” క్రమ బద్ధంగా-భర్త పోయినంత మాత్రాన భార్య,భార్య పోయినంత మాత్రాన భర్త- బతకలేని పరిస్థితులు ప్రస్తుత ప్రపంచంలో లేవు-నూటికో కోటికో ఒక ప్రాణికి ఇలాంటి పరిస్థితి తటస్థించవచ్చు వారి కర్మానుసారం!

ఇలా నూటికో కోటికో జరిగే పరిస్థితి ఉన్నవారికి జీవన్ముక్తి కలిగించండి,శేషకర్మలని వారి రాబోయే జన్మలో అనుభవిస్తారు-మనిషిగానో, లేదా ఏ ప్రాణి రూపంలో గానీ- వారివారి కర్మలనిబట్టి. శ్రీమహావిష్ణువు తన మాటలు చెప్పి ఒక పరి అందర్నీ పరికించాడు,వాళ్ళ అభిప్రాయం కోసం.అందరూ కూడా సంతుష్టులయ్యారు,శ్రీమహా విష్ణువు చెప్పింది సబబుగా ఉందన్నారు.

అప్పుడు శ్రీమహా విష్ణువు మహాశివుణ్ణి ఉద్దేశిస్తూ...

“సదా శివా,ఆ నూటికో కోటికో అనుకున్నవాళ్ళని నీవు గుర్తించి యమధర్మరాజుని ఆ ప్రకారం నడుచుకోమని ఆదేశించవచ్చు-ఇది మాత్రం పూర్తిగా నీ విచక్షణ ప్రకారమే జరుగుతుంది” అని తన తుదిమాటగా చెప్పాడు శ్రీమహావిష్ణువు.అందరూ శ్రీ మహావిష్ణువు నిర్ణయానికి సంతృప్తి చెందారు. శ్రీమహావిష్ణువు యమధర్మరాజుని ఉద్దేశించి"యమా,ఈ విధంగానే భూలోకంలో మానవుల దగ్గరనించి ఇలాంటి విషయాలు ముందు ముందు మీ దృష్టికి వస్తే తప్పక మావద్ద ప్రస్తావించండి" అని అన్నాడు.

యముడు "తప్పక ప్రభూ" అని సమాధానిమిచ్చాడు-యమధర్మరాజు,దేవేంద్రుడు విషయం విపులంగా అర్ధం అవటంతో వారిరువురూ కూడా సంతుష్టులై త్రిమూర్తులకు తమ కృతజ్ఞతలు చెప్పి అభివందనం గావించి వారివద్ద సెలవు తీసుకుని వారివారి లోకాలకి తిరుగు ప్రయాణం అయిపోయారు.

ఇది ఒక రకంగా మానవులకి శుభవార్తే మరి-ఏదో జీవితభాగస్వామిని కోల్పోగానే భావోద్వేగంతో తాముకూడా పోవాలని అనుకునేవాళ్ళని “తధాస్తు దేవతలు” పై నుంచి ఆశీర్వదించరు-వాళ్ళని యమపాశం తాకదు-వారి ఆయువు తీరేంతవరకు!

ఏది ఏమైనా “లయకారకుడు” అయిన మహాశివుని ధ్యానం చేస్తూ ఉంటే చక్కటి ముగింపు పలుకుతాడు మన జీవితాలకి.అంతేగానీ మనమేదో చిరంజీవుల్లాగా ఈ భూమ్మీదే పాతుకుపోవాలని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది.

“జాతస్య మరణం ధృవం”-పుట్టిన వానికి మరణం తప్పదు! అందుకనే మన పెద్దలు క్రింది శ్లోకాన్ని పఠించమన్నారు-ఏదో గుడికి వెళ్ళినప్పుడే కాదు- మనసా వాచా ఇది కోరికగా ఉండాలి ప్రతి మానవునికి!

“అనాయాసేన మరణం,వినాదైన్యేన జీవనం,దేహాంతే తవసాయుజ్యం,దేహిమే పరమేశ్వరా!” ఓ పరమేశ్వరా నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను

1.నాకు నొప్పి,లేక బాధకాని లేని మరణాన్ని ప్రసాదించు!

2.నాకు ఎవరిమీదా ఆధారపడకుండా,నేను జీవితంలోఎవరి ముందూ తలవంచకుండా,ఎవరినీ నొప్పించకుండా,నేను ఎవరివద్దా చులకనకాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు!

3.మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు! జీవించినంతకాలం సంతోషంగా ఉండండి, ఉంచండి...

మరి ముఖ్యంగా,చివరిగా ఇది గ్రహించగలరు….

మహావిష్ణువు మదిలో కూడా లక్ష్మిదేవి తలచినట్టుగా తానూ అదే భావనతోనే ఉన్నాడని నేను ముందే రాసుంటే మీకు ముగింపు ముందే తెలిసిపోతుంది;

అందుచేత ఏ మాత్రం సూచనలు గాని ఆ వాసనగాని మీకు ఇవ్వలేదు నిన్న.వాళ్ళ సంభాషణలు అయిన తర్వాత- లక్ష్మి దేవి తన అభిప్రాయం చెప్పిన తర్వాత కూడా శ్రీమహా విష్ణువు ఏమీ మాట్లాడలేదు-"ఒక చిలిపి నవ్వు నవ్వాడు"అని రాసా అంతే!

సహజంగానే శ్రీమహావిష్ణువు- లక్ష్మీదేవుల ఆలోచనలు ఒకేరకంగా ఉంటాయి- వాళ్ళు ఈ జగత్తుకి తల్లితండ్రులు అవటంచేత-భిన్నంగా ఆలోచించారు కదా!

ఇంకో విషయం నాకు ఆనందం కలిగించేది-ఆయన ఆ రోజు “బాలు”ని గురించి నేను అడిగిన మా మాటల ప్రస్తావన తేవడం దాని పర్యవసానం కూడా వాళ్లందరికీ వివరించడం.మరోసారి మేము మాట్లాడుకునే మాటల్లో ఈ ప్రస్తావన నేను ఇంక తేవక్కర్లేదు- ఆయనే ఒప్పుకున్నాడు కదా,ఇక ఇబ్బంది పెట్టను!పై పెచ్చు ఈ విషయాలన్నీ నాకు తెలియచేయడం వల్లే కదా మీ అందరికీ చెప్పగలుగుతున్నా.

ఏదైనా నాకు వైకుంఠంలో జాగా దొరికిపోయింది “స్వర్గమూ లేదు నరకమూ లేదు” మరి ఆనందం కదూ!

నాలుగు రోజులు ఓపికగా చదివినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు.పనిలో పనిగా మీ లైకులు,బెల్లు కొట్టొద్దు-మీ అభిప్రాయం రాయండి-ముక్కు సూటిగా, కుండ బద్దలు కొట్టినట్టుగా!

“లోకా సమస్తా సుఖినో భవంతు”

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!